: నంద్యాలలో లేరంతే... ఆ పక్కనే మకాం వేసిన మంత్రులు అమర్ నాథ్, ఆదినారాయణ, సోమిరెడ్డి!
నిన్న సాయంత్రం 5 గంటలకు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసిపోగా, నియోజకవర్గానికి చెందని వారెవరూ ఉండరాదన్న నిబంధనల మేరకు ప్రధాన నేతలు, ప్రచారం కోసం వచ్చిన వారంతా నంద్యాలను వీడారు. అయితే, పలువురు ప్రముఖ నేతలు నంద్యాలను వీడారే తప్ప, కర్నూలు జిల్లాను దాటలేదు సరికదా... బనగానపల్లె, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో మకాం వేశారు. బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో మంత్రులు అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డిలు బస చేశారు. వీరు అక్కడి నుంచి ఫైనల్ ప్రచారం, పోలింగ్ బూత్ ల వారీగా నియమితులైన ఏజంట్లకు సలహా, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు నేతలు ఆళ్లగడ్డలోని ప్రధాన లాడ్జీలతో పాటు భూమా, గంగుల వర్గాల వారి ఇళ్లల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక కర్నూలు జిల్లాకు చెందిన వారు మినహా, మిగతా వారంతా జిల్లాను విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, రెండు ప్రధాన పార్టీల నేతలూ లెక్క చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.