: ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ పంచింది డబ్బులు కావు: భన్వర్ లాల్ స్పష్టీకరణ
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు ఉన్న ఓ ఫొటో వార్తల్లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫొటో సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అయింది. జాతీయ న్యూస్ ఛానెళ్లు కూడా ఈ ఫొటోను ప్రసారం చేశాయి. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఈ విషయంపై స్పందిస్తూ... నంద్యాల ప్రచారంలో బాలకృష్ణ డబ్బులు పంచలేదని అన్నారు. ఆ రోజు బాలకృష్ణ చేతిలో ఉన్నవి ప్రచార పత్రాలని కలెక్టర్ తమకు నివేదిక ఇచ్చారని తెలిపారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కూడా తాము నిఘా ఉంచామని తెలిపారు.