: అన్నాడీఎంకే విలీనంపై కమల్ ట్వీట్... ప్రజల్ని వెర్రివాళ్లను చేస్తున్నారని కామెంట్!
తమిళ రాజకీయ పరిణామాలపై విలక్షణ నటుడు కమలహాసన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలవడంపై కూడా ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. పార్టీలు విడిపోవడం, మళ్లీ కలవడం వంటి చర్యలతో తమిళ ప్రజలను ప్రభుత్వం వెర్రివాళ్లను చేస్తోందని ఆయన కామెంట్ చేశారు. తమిళుల తల మీద గాంధీ టోపీ, కాషాయం టోపీ, కాశ్మీర్ టోపీలతో పాటు ఇప్పుడు జోకర్ టోపీ కూడా పెట్టారని ఆయన ఎద్దేవా చేస్తూ, తమిళంలో ట్వీట్ చేశారు. కాగా, సోషల్ మీడియా ద్వారా తమిళ రాజకీయాలపై ప్రభావం చూపించడానికి ప్రభుత్వ పనితీరుపై స్పందించాల్సిందిగా తన అభిమానులను కమల్ ఉసిగొల్పడంపై తమిళ ప్రభుత్వం ఒకింత అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.