: వరుసగా ఆరు 50 ప్లస్ స్కోర్లు సాధించిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ధావన్!
శ్రీలంక పర్యటనలో భాగంగా నిన్న ఆ టీమ్‌పై ఆడిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ బాది అభిమానులను అలరించాడు. 71 బంతుల్లోనే 132 పరుగులు చేసిన ధావన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకపై తాను ఆడిన చివరి ఆరు వన్డేల్లోనూ శిఖర్ ధావన్ 50 ప్లస్ స్కోరు చేసి, అంతర్జాతీయ వన్డేల్లో ఓ ప్రత్యర్థి జట్టుపై ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకతో తాను ఆడిన చివరి ఆరు వన్డేల్లో ధావన్ వరుసగా 94, 113, 79, 91, 125, 132 స్కోర్లు సాధించాడు.
కాగా, శ్రీలంకపై వరుసగా ఐదుసార్లు 50కి పైగా స్కోరు సాధించిన వారిలో టీమిండియా మాజీ ఆటగాళ్లు నవ్‌జోత్ సింగ్ సిద్ధు, మొహమ్మద్ అజారుద్దీన్ ఉన్నారు. శ్రీలంకపై వరుసగా చేసిన ఆరు 50ప్లస్ స్కోర్‌లే కాకుండా ధావన్ గతంలో మరో హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అంటే శ్రీలంకపై మొత్తం ఏడు 50 ప్లస్ స్కోర్లు చేశాడు. ఆ జట్టుపై ఏడుసార్లు 50కి పైగా స్కోరు చేసిన టీమిండియా మాజీ ఆటగాడు సెహ్వాగ్ సరసన ధావన్ నిలిచాడు.