: శిల్పా మోహన్ రెడ్డి పక్కా లోకల్, ఆయనకే ఓటెయ్యండి: ఎమ్మెల్యే రోజా
తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పక్కాలోకల్ అని, ఆయన్ని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారని, అదే, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అలా కాదని, ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడ ఉంటాడో వెతుక్కోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా యాళ్లూరులో నిర్వహించిన రోడ్ షో లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ఎవరైనా తమ పార్టీకే ఓటు వెయ్యాలని బెదిరిస్తే భయపడవద్దని, ప్రజలకు జగన్ అండగా ఉన్నాడని, అవసరమైతే టీడీపీ తాట తీస్తాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని, భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేయడం వల్లే ఆయన గుండెపోటుతో మరణించాడని, అటువంటి, చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం పెద్ద లెక్క కాదని రోజా విమర్శించారు.