: రోడ్డుప్రమాదంలో మరణించిన టీడీపీ నేత తమ్ముడు... నంద్యాల ప్రచారం నుంచి హుటాహుటిన బయల్దేరిన వీరభద్రగౌడ్!
టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ తమ్ముడు కుమార్‌గౌడ్ (48) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నంద్యాల ప్రచారంలో ఉన్న వీరభద్రగౌడ్ తన తమ్ముడి మరణ వార్త తెలిసి అక్కడి నుంచి హుటాహుటిన బయల్దేరారు. పెద్దతుంబళం గ్రామ సమీపంలో కోసిగి గ్రామ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం కుమార్ గౌడ్ షాపూర్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
స్కార్పియో కారు వేగంగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా డోర్లు తెరుచుకోవడంతో డ్రైవర్, కుమార్ గౌడ్ ఇద్దరూ చెరో పక్క ఎగిరిపడ్డారు. దీంతో కుమార్ గౌడ్ అక్కడికక్కడే మృతిచెందారు. అపెక్స్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఎల్ఎల్‌సీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ వంటి వివిధ పదవీ బాధ్యతలను కుమార్ గౌడ్ నిర్వహిస్తున్నారు. సంఘటనను పరిశీలించిన తర్వాత వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకునేలోపే ప్రమాదం జరిగిపోయిందని ఎస్‌ఐ హుసేన్ బాషా తెలిపారు. కుమార్ గౌడ్‌కు భార్య రేవతి, కుమారులు మంజునాథ్‌గౌడ్, మల్లికార్జునగౌడ్ ఉన్నారు.