: ఉద్రిక్త పరిస్థితుల పరిష్కారంపై చర్చించేందుకు చైనా సిద్ధమవుతుంది: రాజ్నాథ్ సింగ్ ఆశాభావం
రెండు నెలలకు పైగా డోక్లాంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చైనా, భారత్ మధ్య ఏర్పడిన ఈ సమస్య పరిష్కారం కోసం చైనా చర్చలకు సిద్ధమవుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డోక్లాంలో ప్రతిష్ఠంభన ఏర్పడిందని, త్వరలోనే అది తొలగిపోతుందన్న నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు.
కాగా, చైనా,భూటాన్, భారత్ సరిహద్దుల్లోని డోక్లాంలో చైనా అక్రమంగా నిర్మిస్తోన్న రోడ్డు నిర్మాణాన్ని ఇండియన్ ఆర్మీ అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ పై చైనా మండిపడుతోంది. దీనిపై అమెరికా కూడా స్పందించి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పింది. అయితే, చైనా మాత్రం మొదట భారత ఆర్మీ వెనక్కి వెళ్లిపోవాలని వ్యాఖ్యానిస్తోంది. చైనా చర్చలకు అంగీకరించకపోతుండడంతో భారత్.. చైనా సరిహద్దుల గుండా భద్రతను మరింత పెంచింది.