: ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేస్తున్న హైదరాబాద్ వాసి
వివిధ ఉత్పత్తుల వాడకం తర్వాత నిరుపయోగమైన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధనం తయారుచేస్తున్నాడు హైదరాబాద్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ సతీశ్ కుమార్. 500 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి 400 లీటర్ల ఇంధనాన్ని తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. మూడంచెల రివర్స్ ఇంజనీరింగ్ విధానం ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన చెప్పాడు.
గాలి రహిత పరిస్థితుల్లో వ్యర్థాలను మండించి, డీ పాలీమరైజేషన్, గ్యాసిఫికేషన్, కండెన్సేషన్ పద్ధతుల ద్వారా సతీశ్ పెట్రోల్ లాంటి ఇంధనాన్ని సృష్టిస్తున్నాడు. ఈ ప్రక్రియకు `ప్లాస్టిక్ పైరోలసిస్` అని పేరు పెట్టాడు. ఈ ప్రక్రియ వల్లగానీ, ఇంధనం ఉపయోగించడం వల్ల గానీ పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని సతీశ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఇంధనాన్ని స్థానిక పరిశ్రమల అవసరాలకు లీటరుకు రూ. 40 - 50కి అందజేస్తున్నట్లు, త్వరలోనే వాహనాలకు కూడా ఉపయోగించే యోచనలో ఉన్నట్లు సతీశ్ తెలిపాడు.