: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సమస్యలపై పోరాడేందుకు యూనియన్ ఏర్పాటు!
ఇండియా సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే బెంగళూరులో నిన్న ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు తొలి జనరల్ బాడీ మీటింగ్ పేరిట ఓ సమావేశం ఏర్పాటు చేసి ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పే అంశంపై చర్చించారు. నగరంలోని కోరమంగళలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కర్ణాటకలోని సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతుండడంతో రిజిస్ట్రెడ్ యూనియన్‌ను ఏర్పాటు చేయాలని, దాని ద్వారా ఐటీ ఉద్యోగుల తరఫున గళం విప్పే ప్రయత్నం చేయాలని వారు నిర్ణయించారు.
కర్ణాటక రాష్ట్ర ఐటీ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ ఇండస్ట్రీలో ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడడానికి ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించామని అన్నారు. ప్రస్తుతం ఏ ఐటీ సంస్థలోనైనా ఉద్యోగి ఏదైనా సమస్య ఎదుర్కుంటే ఆ ఉద్యోగి ఒక్కడే సంస్థతో పోరాడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఇలా ఎవరికి వారు తమ సమస్యలను ఒంటరిగా చెప్పుకుంటే కంపెనీ అధినేతలు వారు చెప్పేది వినిపించుకోవడం లేదని అన్నారు.
రిజిస్ట్రెడ్ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసి, తాము ఉద్యోగుల సమస్యలపై పోరాడడమే కాకుండా, తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు కూడా ఉంచే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇంతవరకు తమకు రిజిస్ట్రెడ్ యూనియన్ లేదని చెప్పారు. ఇటువంటి యూనియన్ లేకపోతే తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు అడుగు ముందుకు వేసే అవకాశం లేదని అన్నారు. ఐటీ ఇండస్ట్రీలోని ఉద్యోగులు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని తెలిపారు. బెంగళూరులోని ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగులు మాత్రమే కాకుండా చెన్నై ఉద్యోగులు కూడా యూనియన్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ రెండు నగరాల ఐటీ ఉద్యోగులు భవిష్యత్తులో దేశమంతటా యూనియన్‌ను విస్తృతపర్చడానికి కృషి చేస్తారని తెలిపారు.