: పదవీ వ్యామోహం లేదు... ప్రజల కోసం సర్వం త్యాగం: భూమా అఖిల ప్రియ
తనకు పదవీ వ్యామోహం లేదని ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. నంద్యాలలో ఆమె మాట్లాడుతూ, ఈ జీవితం ప్రజలకే అంకితమని అన్నారు. ప్రజల కోసం, పార్టీ కేడర్ కోసం తాను పని చేస్తానని ఆమె తెలిపారు. పదవి కోసమే తన తండ్రి మరణించిన తరువాతిరోజు అసెంబ్లీకి వెళ్లానన్న ఆరోపణలు వాస్తవం కాదని అన్నారు. తన తండ్రి ఆశయాలను అసెంబ్లీకి చెప్పాలనే తాను వెళ్లానని ఆమె అన్నారు.
తన పదవిని ఈ క్షణంలో వదిలేయమన్నా వదిలేసేందుకు ఏమాత్రం వెనుకాడనని ఆమె చెప్పారు. పదవి తమకు ముఖ్యం కాదని, తన తల్లిదండ్రులు సంపాదించిన కేడర్ ను కాపాడుకోవడమే తమకు ముఖ్యమని అన్నారు. కేడర్ కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. పార్టీ కేడరే తమను గెలిపిస్తుందని ఆమె తెలిపారు.