: టోల్ ఫీజు చెల్లించలేదని నడిరోడ్డుపై సర్పంచ్‌ను చావబాదిన సిబ్బంది!
టోల్ ఫీజు చెల్లించేందుకు నిరాకరించిన సర్పంచ్‌ను దారుణంగా చితకబాదిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని దుదాపూర్ సర్పంచ్ అయిన చంపాదాస్ వైష్ణవ్ వాహనంలో ప్రయాణిస్తూ పాలి-దేసురి మెగాహైవేపై ఉన్న టోల్ బూత్ గుండా ప్రయాణించారు. ఈ క్రమంలో టోలు ఫీజు కోసం సిబ్బంది డిమాండ్ చేయగా చెల్లించేందుకు అతడు నిరాకరించాడు. తాను కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించానని, టోలు చెల్లించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో సిబ్బందికి, సర్పంచ్‌కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది.
అది మరింత వేడెక్కడంతో సిబ్బంది మూకుమ్మడిగా సర్పంచ్‌పై దాడి చేసి చావబాదారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. టోల్ సిబ్బంది దాడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న సర్పంచ్ చంపాదాస్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన దుదాపూర్ గ్రామస్తులు టోల్‌గేటు వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు ఏడుగురు టోల్ బూత్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.