: నేటితో మూగబోనున్న నంద్యాల మైకులు... 'టీడీపీ, వైసీపీల ఖర్చు రూ.200 కోట్లు' అంటూ కాంగ్రెస్ ఆరోపణ!
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం, వైసీపీలు ప్రచారంతో హోరెత్తించాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారాన్ని రక్తి కట్టించాయి. మధ్యలో వైసీపీ నేత రోజా, సినీ హాస్య నటుడు వేణుమాధవ్‌ల వ్యాఖ్యలతో ప్రచారం వేడెక్కింది.
ఇక ప్రచారంలో జగన్ పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను నడిరోడ్డుపై కాల్చి చంపాలని ఓసారి, ఉరితీయాలని మరోసారి ఇలా.. పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ హింసను ప్రేరేపిస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఇక రెండు రోజులుగా నంద్యాలలో మకాం వేసిన సీఎం చంద్రబాబు ఆదివారం వివిధ వర్గాల వారితో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏం చేసిందీ, ఏం చేయబోతోందీ వారికి వివరించారు. మరోవైపు జగన్ నేడు (సోమవారం) కూడా ప్రచారం నిర్వహించనున్నారు.
ఇక ఈ ఎన్నిక సందర్భంగా వైసీపీ, టీడీపీలు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయని, ఓటర్లకు డబ్బులు వెదజల్లాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వెంటనే ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నంద్యాల అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ తదితరులు ఆదివారం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి 3.82 లక్షలు, వైసీపీ అభ్యర్థి రూ.5.68 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పడం పూర్తిగా దగా అని ఆయన ఆరోపించారు. కాగా, సంప్రదాయ ఓటు బ్యాంకుపై కన్నేసిన కాంగ్రెస్ నేడు నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించనుంది.