: ఒక్కరోజు కూడా జిమ్ కు వెళ్లకుండా ఉండలేను: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
ఒక్కరోజు కూడా జిమ్ కు వెళ్లకుండా తాను ఉండలేనని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకు ఫిట్ నెస్ అంటే ప్రాణమని, అందుకే, ప్రతిరోజూ జిమ్ కు వెళ్లాల్సిందేనని చెప్పింది. కేవలం తాను వెళ్లడమే కాదని, తన స్నేహితులతోనూ వ్యాయామం చేయిస్తుంటానని చెప్పింది. వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయని, తద్వారా కావల్సినంత శక్తి మనకు అందుతుందని, ఆరోగ్యంగా, అందంగానూ ఉంటామని తాను నమ్ముతానని తెలిపింది.
ఫిట్ నెస్ పై తనకు ఉన్న మమకారంతోనే ఎఫ్ 45 పేరిట జిమ్ సెంటర్లు ఏర్పాటు చేశానని చెప్పింది. ఈ సందర్భంగా ఎఫ్ 45 అంటే ఏంటో వివరించింది. ‘ఎఫ్’ అంటే ఫంక్షనల్ ట్రెయినింగ్, ‘45’ అంటే నలభై ఐదు నిమిషాల్లో అని చెప్పింది. కేవలం, నలభై ఐదు నిమిషాల్లో మంచి ఫలితాలు ఇచ్చే వ్యాయామం అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.