: నిరుద్యోగ భృతిపై పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందుతుంది: ఏపీ మంత్రి పితాని
నిరుద్యోగ భృతిపై పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందుతుందని ఏపీ మంత్రి పితాని సత్యానారాయణ అన్నారు. గుంటూరులోని హిందూ కళాశాలలో నిర్వహించిన కౌండిన్య సేవా సమితి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ విజయరావును సన్మానించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి హామీని త్వరలో నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, ఈ విషయమై మంత్రి వర్గ ఉప సంఘం చర్చిస్తోందని అన్నారు. నిరుద్యోగ భృతిని నగదుగా ఇవ్వాలా? లేక నైపుణ్యాభివృద్ధి రూపంలో ఇవ్వాలా? అనే విషయంపైన; ఇంకా వయసు, విద్యార్హత అంశాలపైన చర్చ జరుగుతోందని, నిరుద్యోగ భృతి హామీని రూ.500 కోట్లతో తప్పక నెరవేరుస్తామని మరోమారు ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధి కల్పనా కార్యాలయాల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ కార్యాలయాలను త్వరలో ఆధునికీకరించనున్నామని, వీటికి పూర్వ వైభవం తీసుకువస్తామని, ఇందుకోసం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తామని, ఏపీపీఎస్సీతో ఈ శాఖను అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలనూ యువతకు చేరువ చేస్తామని చెప్పారు.