: అలాంటి పార్టీకి బలిజ కులస్తులు ఓటు వేస్తారా?: వైసీపీ నేత జోగి రమేష్


కాపుల గొంతు కోసింది చంద్రబాబేనని, ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమానే చెప్పారని వైసీపీ నేత జోగి రమేష్ అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, నాడు విజయవాడలో నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగాను కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపించారని, ఇప్పుడేమో మంజునాథ నివేదిక రావాలంటూ చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇంటిని జైలుగా మార్చేశారని, ఆయనను వేధింపుల పాలు చేస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. అలాంటి పార్టీకి బలిజ కులస్తులు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు.

అవనిగడ్డ, నందిగామ, తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే, ఆయా నియోజకవర్గాల్లో ఏకగ్రీవానికి తమ పార్టీ సహకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. హోల్ సేల్ గా అబద్ధాలు ఆడే చంద్రబాబును, నంద్యాల ప్రజలు ఓటు ద్వారా తరిమి కొడతారని జోగి రమేష్ అన్నారు. ఇదిలా ఉండగా, నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీని ఓడించాలంటూ ఓటర్లకు లెఫ్ట్ పార్టీలు పిలుపు నిచ్చాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో టీడీపీ విఫలమైందని, ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించాయి. వెనుకబడిన రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఆయన ద్రోహం చేశారని, ఈ నేపథ్యంలో నంద్యాల ఉపఎన్నికలో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నాయి. 

  • Loading...

More Telugu News