: తొలి వన్డే ఆడుతూ 12 పరుగులు చేసిన నాటి బచ్చా కోహ్లీ... నేడు అదే మైదానంలో కెప్టెన్ గా బరిలోకి దిగుతున్న వైనం!


శ్రీలంకలోని దంబుల్లా మైదానం. కోహ్లీకి తొలి వన్డే క్రికెట్ పోటీ ఆడేందుకు వేదికగా నిలిచిన మైదానమది. సరిగ్గా 9 సంవత్సరాల క్రితం అంటే... 2008లో విరాట్ కోహ్లీ తొలిసారిగా జట్టులోకి వచ్చి దంబుల్లా మైదానంలో ఓపెనర్ గా దిగాడు. అప్పటికి అతను ఓ బచ్చా. అండర్ 19 భారత జట్టుకు సారథ్యం వహించి, కప్ కొట్టుకు రావడంలో కీలక పాత్ర పోషించినందుకు కోహ్లీ మెయిన్ టీమ్ కు ప్రమోషన్ పొందాడు. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గాయపడటంతో అనుకోకుండా జట్టులో స్థానం పొందాడు. అతని స్థానంలోనే ఓపెనర్ గా దిగాడు.

 ఇక తన తొలి మ్యాచ్ లో కోహ్లీ చేసింది 12 పరుగులు మాత్రమే. అయితేనేం, అప్పుడు టీనేజ్ క్రికెటర్ గా, దిగ్గజాలైన ఆటగాళ్ల మధ్య ఓ పిల్లాడిలా ఉన్న కోహ్లీ, ఇప్పుడు అదే మైదానంలో ప్రస్తుత స్టార్ ఆటగాళ్లను నడిపించే కెప్టెన్ గా బరిలోకి దిగుతుండటం గమనార్హం. ఈ తొమ్మిదేళ్లలో 189 వన్డేల్లో 8257 పరుగులు చేసిన కోహ్లీ, 28 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు సాధించి, ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు. దాదాపు దశాబ్దం తరువాత తన తొలి మ్యాచ్ ఆడిన మైదానంలో నేడు రెండో మ్యాచ్ ని ఆడుతున్న కోహ్లీ, ఆనాటి రోజులు తనకు గుర్తొస్తున్నాయని వ్యాఖ్యానించాడు. మరోవైపు దంబుల్లా మైదానం నిర్వాహకులు నేడు కోహ్లీని ప్రత్యేకంగా సన్మానించనున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News