: తీవ్ర ఒత్తిడిలో శ్రీలంక... కనీసం రెండు మ్యాచ్ లు గెలిస్తేనే వరల్డ్ కప్ ఆడే చాన్స్!


ఇండియాతో నేటి నుంచి ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆడనున్న శ్రీలంక ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో కోల్పోయిన లంకేయులు, వన్డే సిరీస్ లో కనీసం రెండు మ్యాచ్ లు గెలిస్తేనే, వచ్చే ప్రపంచ కప్ క్రికెట్ ఆడేందుకు డైరెక్టుగా అర్హతను సాధిస్తారు. లేకుంటే క్వాలిఫయ్యింగ్ మ్యాచ్ లను శ్రీలంక ఆడాల్సిందే. 1996లో చాంపియన్స్ గా నిలిచిన జట్టు డైరెక్టుగా అవకాశాన్ని పొందలేదంటే, అది దేశానికే అవమానమని క్రీడాభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

నేడు దంబుల్లాలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుండగా, గత మూడు రోజుల నుంచి ఇరు జట్లూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ఐసీసీ జట్టు ర్యాంకింగ్స్‌ లో ప్రస్తుతమున్న మూడో స్థానాన్ని ఇండియా కొనసాగించాలంటే, కనీసం 3-2 తేడాతో సిరీస్ గెలవాలి. ప్ర‌స్తుతం టీమిండియా ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం లంక 90 పాయింట్లతో ఉండగా, లంక కింద 78 పాయింట్లతో వెస్టిండీస్ ఉంది. వరల్డ్ కప్ కు పాయింట్ల కటాఫ్ సెప్టెంబర్ నెలాఖరు కాగా, వెస్టిండీస్ జట్టు ఐర్లండ్ తో వన్డే సిరీస్ ను, ఆపై ఇంగ్లండ్ తో మరో సిరీస్ ను ఆడనుంది. ఇండియాతో సిరీస్ లో లంక వైట్ వాష్ అయితే, 86 పాయింట్లకు, 4-1 తేడాతో ఓడితే 88 పాయింట్లకు, 3-2 తేడాతో ఓడితే 90 పాయింట్లకు చేరుతుంది. కనీసం రెండు మ్యాచ్ లు గెలిస్తేనే విండీస్ కన్నా మెరుగైన స్థితికి లంక చేరుతుంది. లేకుంటే, ర్యాంకింగ్ పరంగా విండీస్ కన్నా కిందకు దిగజారి, క్వాలిఫయ్యింగ్ పోటీలు ఆడక తప్పదు.

కాగా, ర్యాంకింగ్స్ లో టాప్ 6లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లతో పాటు పోటీలకు ఆతిథ్యమిచ్చే ఇంగ్లండ్ ఇప్పటికే క్వాలిఫై కాగా, వచ్చే నెలాఖరుకు టాప్-8వ స్థానంలో ఉండే జట్టు కూడా చోటు సంపాదించుకుంటుంది. రెండు స్థానాలకూ వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ మధ్య క్వాలిఫయర్ పోటీలు జరుగుతాయి. ఇప్పుడిక వెస్టిండీస్, శ్రీలంక జట్లలో ఏది ముందడుగు వేసి డైరెక్ట్ గా క్వాలిఫై అవకాశాన్ని పొందుతుందన్న విషయమై ఆసక్తి నెలకొని వుంది.

  • Loading...

More Telugu News