: జగన్ క్విడ్ ప్రోకోను లా పుస్తకాల్లో కేస్ స్టడీగా పెట్టారు: చంద్రబాబు
జనాల కోసం ఏదేదో చేస్తున్నట్టు విపక్ష నేత జగన్ నటిస్తున్నారని... బుగ్గలు నిమురుతాడని, తలపై చేతులు పెడతాడని... మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ పని అయిపోతుందని నంద్యాల ఓటర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 15 రోజుల నుంచి ఇక్కడే తిష్ట వేశాడని... అంత అవసరం ఏముందని ప్రశ్నించారు. నడి రోడ్డుపై కాల్చేయమంటాడు, ఉరి తీయమంటాడు, బట్టలు ఊడదీయాలంటాడు... ఒక విపక్ష నేత మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని అన్నారు. మనం వారిని కాల్చనవసరం లేదని, ఉరితీయాల్సిన అవసరం లేదని... ఓటుతోనే ఖతం చేసేద్దామని చెప్పారు. ఈ ఎన్నికతో వారి అడ్రస్ గల్లంతవడం ఖాయమని చెప్పారు. రాజకీయ నేతలు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలని అన్నారు.
లా పుస్తకాల్లో ఇటీవలే క్విడ్ ప్రోకో అనే అంశాన్ని చేర్చారని... అందులో జగన్, గాలి జనార్దన్ రెడ్డిల క్విడ్ ప్రోకోను కేస్ స్టడీగా పెట్టారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతికి రావడానికి జగన్ కు సమయం ఉండదని... ఇక్కడ మాత్రం 15 రోజుల నుంచి మకాం వేశారని చెప్పారు. జగన్ ను చూసి తాను భయపడుతున్నానని చెప్పుకుంటున్నారని... ఇదంతా గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుందని అన్నారు. మార్కెట్ భూములను, పేదల భూములను కాజేసిన శిల్పా మోహన్ రెడ్డిని గెలిపిస్తే... నంద్యాల ప్రజల కష్టాలు మరింత పెరుగుతాయని చెప్పారు.