: రూ.100 కోట్లు తరలిస్తున్నారని వైసీపీ తప్పుడు ప్రచారం... కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తూ కలకలం సృష్టిస్తోందని టీడీపీ నేతలు ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి సీఎం ఆహార వాహనంలో రూ.100 కోట్లు తరలిస్తున్నారని వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని తెలిపారు. ఆ వాహనాన్ని అందరి సమక్షంలో అధికారులు తనిఖీ చేశారని, వాహనంలో నగదు లేదని తెలిసిందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆహార వాహనంపై నిఘా పెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ అంశం సీఎం భద్రతకే ముప్పు అని అన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై కుట్ర కోణంలో దర్యాప్తు జరపాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.