: నితీశ్ కుమార్ మరో కీలక నిర్ణయం... ఎన్డీఏలో చేరుతూ తీర్మానం చేసిన జేడీయూ
ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని భారతీయ జనతా పార్టీతో కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ అధ్యక్షుడు, సీఎం నితీశ్‌కుమార్ మరో అడుగు ముందుకేసి ఎన్డీఏలో చేరుతున్నట్లు తీర్మానాన్ని ఆమోదించారు. నితీశ్‌కుమార్ నివాసంలో ఈ రోజు జేడీయూ జాతీయ కార్యనిర్వాహక కమిటీ భేటీ అయి ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏలో జేడీయూ చేరాలని కోరుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవలే ఆ పార్టీకి ఆహ్వానం పంపారు.
మరోవైపు జేడీయూ జాతీయ కార్యనిర్వాహక కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ మద్దతుదారులతో పాటు ఆర్జేడీ కార్యకర్తలు సీఎం నితీశ్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పోలీసు బందోబస్తును పెంచారు. జేడీయూ కార్యనిర్వాహక కమిటీ భేటీకి శరద్ యాదవ్‌కు కూడా ఆహ్వానం అందగా ఆయన మాత్రం హాజరుకాలేదు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని శరద్ యాదవ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే.