: బుల్లితెరకు మరో అగ్ర కథానాయకుడు... టాక్ షో వ్యాఖ్యాతగా మోహన్‌లాల్!
బిగ్‌బాస్‌తో తమిళ, తెలుగులో అగ్రకథానాయకులు కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్‌లు వ్యాఖ్యాతలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరి బాటలోనే దక్షిణాది చిత్రసీమలో నాలుగు దశాబ్దాలుగా నటిస్తున్న మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా బుల్లితెర రంగప్రవేశం చేశాడు. `లాల్ సలాం` పేరుతో ఓ టాక్ షోను ఆయన హోస్ట్ చేస్తున్నారు. ఇటీవలే ప్రసారమైన ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్‌కి మంచి స్పందన వచ్చింది. అన్ని రకాల టాక్ షోల మాదిరి కాకుండా సమాజంలో మార్పులు తీసుకువస్తున్న వ్యక్తులను ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేస్తారు.
సమాజ సేవ కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తున్న వ్యక్తులకు ఈ కార్యక్రమం ద్వారా ఓ గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంఘసంస్కర్తలు, సామాజిక వేత్తలతో పాటు చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వాళ్లను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. మొదటి ఎపిసోడ్‌లో గాయని చిత్ర, మంజు వారియర్, టీపీ మాధవన్ వంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రతి శుక్ర, శని వారాల్లో అమృత టీవీలో ప్రసారమవుతోంది.