: ఏరోస్పేస్ ప్లాంట్ ను ప్రారంభించిన కేటీఆర్!
హైదరాబాద్ శివార్లలో ఉన్న ఆదిభట్ల ఇండస్ట్రియల్ పార్కులోని న్యూకాన్ ఏరోస్పేస్ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాదులో ప్రస్తుతం ఆదిభట్ల, శంషాబాద్ లలో రెండు ఏరోస్పేస్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. మూడో ఏరోస్పేస్ సెంటర్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరాన్ని రక్షణ, వైమానిక రంగాల హబ్ గా మారుస్తున్నామని అన్నారు.
పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనువైన ప్రదేశమని... కొత్త పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో 2.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. హైదరాబాదులో వైమానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం లండన్ కు చెందిన ట్రన్ ఫిల్డ్ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
మరోవైపు, బీడీఎల్ రూపొందిస్తున్న ఆకాశ్ మిసైల్ తోక భాగాన్ని న్యూకాన్ ఏరోస్పేస్ లో తయారు చేస్తున్నారు. ఈ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది.