: రోడ్డెక్కిన ఐటీ ఉద్యోగులు... అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ నిరసన ర్యాలీ!
పని సమర్థవంతంగా చేయలేదని, పనితీరులో లోపాలున్నాయని కుంటి సాకులు చెబుతూ ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తమను ఉద్యోగంలో నుంచి తీసేయడంపై హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కారు. `మా ఉద్యోగం మాకివ్వండి`, `కార్పోరేట్ అత్యాశ నశించాలి` అంటూ నినాదాలు చేస్తూ రహేజ మైండ్‌స్పేస్ వద్ద ర్యాలీకి దిగారు. `ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్` బృందంగా టెక్కీలందరూ ఏకమై `వాక్ ఫర్ జస్టిస్` అంటూ ర్యాలీ తీశారు. ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరారు.
ఈ విషయమై హైదరాబాద్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకోకపోవడంతో నలుగురు ఉద్యోగులు కలిసి హైకోర్టులో పిటిషన్ వేసినట్లు వారు తెలిపారు. పిటిషన్‌పై సమాధానం కోరుతూ హైకోర్టు టెక్ మహీంద్రాకు నోటీసులు జారీచేసింది. అలాగే తెలంగాణ లేబర్ కమిషనర్, డిప్యూటీ లేబర్ కమిషనర్‌లకు కూడా హైకోర్టు నోటీసులు పంపింది. ఐటీ రంగంలో తిరోగమనం, అభివృద్ధి చెందుతున్న యాంత్రీకరణ కారణంగా ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.