: ట్రంప్ కు దేశాన్ని నడిపే సామర్థ్యం లేదు...వైట్ హౌస్ ను తక్షణం ప్రక్షాళన చేయాలి: సెనేటర్ బాబ్ కార్కర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సొంత పార్టీ సీనియర్లు, విపక్ష డెమోక్రాట్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జాత్యహంకార దాడులు పెరిగిపోతుండడం, శ్వేతజాతీయులు సంయమనం పాటించకుండా ఇతరుల విగ్రహాలు ధ్వంసం చేస్తూ అల్లర్లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ సెనేటర్, శక్తిమంతమైన సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ బాబ్ కార్కర్ టెన్నిసీ స్టేట్ లోని చట్టనూగా లో మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్ కు దేశాన్ని నడిపే సామర్థ్యం, స్థిరత్వం లోపించాయని అన్నారు.
వైట్ హౌస్ ను తక్షణం సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రంప్ ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ఆయన ఆత్మపరిశీలన చేసుకుని, తన సామర్థ్యం నిరూపించుకుంటారని ఆయన ఆకాంక్షించారు. అదే సమయంలో డెమొక్రాటిక్ సభ్యుడు స్టీవ్ కోహెన్ మాట్లాడుతూ, ట్రంప్ ను అభిశంసించాలని డిమాండ్ చేశారు.