: నాది అభివృద్ది మంత్రం.. వారికి అధికారం, డబ్బు కావాలి: నంద్యాల రోడ్ షోలో చంద్రబాబు
కేవలం అభివృద్ధి కోసమే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన చనిపోవడానికి ముందు రోజు కూడా తన వద్దకు వచ్చారని... అభివృద్ధి పనుల గురించే తనతో చర్చించారని తెలిపారు. నంద్యాలలో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు. నంద్యాలను సుందరమైన పట్టణంగా మారుస్తానని చెప్పారు. పదేళ్లలో నంద్యాలలో ఏమీ చేయలేకపోయిన వ్యక్తులు ఇప్పడు తన ప్రభుత్వంలో ఏమి చేస్తారని ప్రశ్నించారు. నంద్యాల రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలకు అధికారం, డబ్బు కావాలని... ప్రజల సంక్షేమం వారికి పట్టదని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని... కట్టుబట్టలతో అమరావతికి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పారు. నంద్యాలను స్మార్ట్ సిటీగా మారుస్తానని తెలిపారు. టీడీపీపై బురద చల్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని... అన్నీ అబద్దాలే చెబుతున్నారని మండిపడ్డారు. తనకు పేపరు, చానల్ లేదని జగన్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాది వ్యవధిలోనే పూర్తి చేశామని తెలిపారు. పోలవరంను కూడా అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని చెప్పారు.