: అసమర్థుని జీవ యాత్ర కాసేపట్లో ప్రారంభంకానుంది: భూమన
నంద్యాలలో తమ నాయకుడు జగన్ జైత్రయాత్ర 11వ రోజుకు చేరుకుందని... ఈ ప్రచార కార్యక్రమంతో నంద్యాల ప్రజల గుండెల్లో జగన్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ, అందుకు కారణాలను వివరిస్తూ జగన్ ముందుకు సాగుతున్నారని చెప్పారు.
ఓటర్లంతా వైసీపీకే ఓటు వేయాలని నిశ్చయించుకున్న ఈ సందర్భంలో, ఓ అసమర్థుడి జీవ యాత్ర కాసేపట్లో ప్రారంభం కాబోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు యాత్రతో ఒరిగేది ఏమీ లేదని... ఆయన ఎన్ని దొంగ మాటలు చెప్పినా నంద్యాల ప్రజలు నమ్మరని... టీడీపీకి చివరకు మిగిలేది ఓటమేనని చెప్పారు. టీడీపీవారు డబ్బును వెదజల్లుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలీసులకు కూడా టీడీపీ నేతలు కమిషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీకి చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు పంచలేదని... డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో తమ కార్యకర్తలు కొందరిని అన్యాయంగా అరెస్ట్ చేశారని భూమన అన్నారు. ఎన్నికలు నీతివంతంగా జరగాలనేదే వైసీపీ కోరిక అని చెప్పారు. వందల కోట్లను టీడీపీ వెదజల్లుతోందని... మన దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఈ ఎన్నికను టీడీపీ మలచిందని అన్నారు. జగన్ ప్రచారం జైత్రయాత్రలా సాగుతుంటే... చంద్రబాబు ప్రచారం జీవ యాత్రలా సాగుతోందని ఎద్దేవా చేశారు.