: దహన సంస్కారాలకు డబ్బు లేక.. తండ్రి శవాన్ని ఇంటి వెనుకే పాతిపెట్టిన కుమారుడు!
కన్న తండ్రి దహన సంస్కారాలను నిర్వహించేందుకు డబ్బు లేకపోవడంతో... శవాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టాడో కొడుకు. ఈ ఘటన పంజాబ్ లోని బఠిండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, హోంగార్డ్ గా పనిచేస్తున్న సూర్జిత్ సింగ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారం క్రితం అతను చనిపోయాడు. తండ్రి అకాల మరణంతో ఏం చేయాలో ఆయన కుమారుడు మనోజ్ కు అర్థం కాలేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో, దహన సంస్కారాలను నిర్వహించేందుకు కూడా అతని వద్ద డబ్బు లేకపోయింది. దీంతో, తన ఇంటి వెనకున్న పెరట్లోనే తండ్రి శవాన్ని పాతిపెట్టాడు. ఆరు రోజుల తర్వాత వీధి కుక్కలు సమాధిని తవ్వుతుండగా ఆయన మృతదేహం బయటపడింది. దీంతో, స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు మనోజ్ ను ప్రశ్నించారు. తండ్రి దహన సంస్కారాల కోసం చాలా మంది బంధువులను డబ్బు అడిగానని, ఎవరూ సహాయం చేయలేదని మనోజ్ తెలిపాడు. తిండి తినడానికి కూడా డబ్బులు లేకపోవడంతో, గురుద్వారా నుంచి ఆహారం తెచ్చుకున్నానని చెప్పాడు. ఏం చేయాలో అర్థంకాక ఇంటి వెనుక శవాన్ని పాతిపెట్టానని తెలిపాడు. మనోజ్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసుకున్న పోలీసులు... మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.