: ఆమె మృత్యుంజయురాలు... మూడు ఉగ్రదాడులను తప్పించుకుంది!
కొంత మందిని ఎప్పటికప్పుడు అదృష్టం ఆదుకుంటూ వుంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన జూలియా మొనాకో (26) కూడా తాను చాలా అదృష్టవంతురాలినని ఆనందిస్తోంది. ఎందుకంటే, జూలియా ఇప్పటికి మూడు సార్లు ఉగ్రదాడుల నుంచి క్షేమంగా బయటపడింది. లండన్ లోని బ్రిటన్ పార్లమెంట్ ముందు ఒక ఉగ్రవాది పాదచారులపై కత్తితో విరుచుకుపడిన సమయంలో జూలియా అక్కడే ఉంది.
ఆ తరువాత పారిస్ లో ఫుట్ బాల్ మ్యాచ్ అనంతరం భారీ ఎత్తున ఉగ్రదాడులు చోటుచేసుకుని బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆమె అక్కడే ఉంది. కానీ సురక్షితంగా బయటపడింది. తాజాగా స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగిన ఉగ్రదాడి సమయంలోనూ ఆమె అక్కడే ఉన్నారు. సెలవులు గడిపేందుకు స్నేహితులతో కలిసి ఆమె లాస్ రంబెల్స్ లో ఉంది. అయితే ఈ సారి కూడా ఆమె క్షేమంగా బయటపడింది. దీంతో మూడు సార్లు ఉగ్రదాడులకు సాక్షిగా నిలిచినా ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఇప్పుడంతా ఆమెను మృత్యుంజయురాలు అంటున్నారు.