: ఎన్నికలు అనగానే ప్రజల కళ్లకు చంద్రబాబు గంతలు కట్టేస్తారు: వైఎస్ జగన్
చంద్రబాబు గురించి ఓ మిత్రుడు తనకు ఓ లేఖ రాశాడని, ఆ లేఖలో చంద్రబాబు నైజం గురించి బాగా చెప్పాడంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలోని మసీదు సెంటర్ లో నిర్వహించిన రోడ్ షో లో జగన్ మాట్లాడుతూ, ఎన్నికలు వస్తున్నాయనగానే ప్రజల కళ్లకు చంద్రబాబు గంతలు కడతారని, ఇంద్రలోకం చూపిస్తారని, చంద్రబాబుకు మద్దతుగా కొన్ని చానెల్స్, పత్రికలు వంతపాడుతున్నాయని ఆరోపించారు.
చంద్రబాబును ఎవరైతే విమర్శిస్తారో వారిపై లేనిపోని ఆరోపణలు చేయడంతో పాటు తప్పుడు ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఏరుదాటాక తెప్పతగలేయడంలో చంద్రబాబు డిగ్రీ పూర్తి చేశారని, పదవి కోసం, అధికారం కోసం చంద్రబాబు ఎంతటి పనికైనా పాల్పడతారని టీడీపీ వ్యవస్థాపకుడు, ఆయన మామ ఎన్టీఆర్ నాడు విమర్శించారని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, సీఎం కుర్చీని, ట్రస్ట్ ను చంద్రబాబు లాక్కున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని, అటువంటి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావద్దంటూ ఓటర్లకు జగన్ సూచించారు.