: వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణి అందించి, చైనాకు కోపం తెప్పించే పని చేసిన భారత్
ఆయుధ ఒప్పందంలో భాగంగా వియత్నాం దేశానికి అత్యున్నత క్షిపణి బ్రహ్మోస్‌ను భారత్ అందజేసింది. ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఆయుధ ఒప్పందంలో భాగంగా, చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న సమయంలో క్షిపణిని అందజేయడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. భారత్ చేసిన ఈ పని వల్ల చైనాకు కచ్చితంగా కోపం వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనా - వియత్నాం దేశాలకు దక్షిణ చైనా సముద్ర ప్రాంత విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి.
బ్రహ్మోస్ క్షిపణి అందజేసి భారత్, వియత్నాం దేశానికి గట్టి బలాన్ని చేకూర్చిందని చైనా అభిప్రాయపడే అవకాశాలున్నాయి. అయితే ఈ క్షిపణిని అందజేసినట్లుగా భారత రక్షణ శాఖ నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం లేదు. కాకపోతే తమకు క్షిపణి అందినట్లు వియత్నాం విదేశాంగ ప్రతినిధి లె థి థూ హాంగ్ మీడియాకు చెప్పారు. ఈ క్షిపణిని అందజేయడం వల్ల భారత్ - వియత్నాం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ఇక, ఈ బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగం కంటే 2.8 రెట్లు వేగంగా ప్రయాణించి శత్రుస్థావరాలను మట్టుపెట్టగలదు. బ్రహ్మోస్ క్షిపణి వల్ల భారత్ - చైనా మధ్య స్నేహం దెబ్బతింటుందని గత ఏప్రిల్‌లో చైనా రక్షణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. డోక్లాం వివాదం సమయంలో వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణి అందజేయడం వల్ల గొడవ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.