: ఎమ్మెల్సీతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ నేత... వీడియో చూడండి
వేదిక మీద ఓ పక్క స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతుండగా మరో పక్క కాంగ్రెస్ నాయకుడు టీపీ రమేశ్, ఎమ్మెల్సీ వీణా అచ్చయ్యతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కాడు. కర్ణాటకలోని కొడగు జిల్లాలో మాదికేరి పట్టణంలో జరిగిన వేడుకలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రమేశ్, వీణా చేయి పట్టుకుంటుండగా, ఆమె అప్రమత్తమై వెంటనే ఇబ్బంది పడుతూ తన చేయి వెనక్కి లాక్కుంది. ఇదంతా వీడియోలో స్పష్టంగా రికార్డవడంతో టీపీ రమేశ్ విమర్శలు ఎదుర్కుంటున్నారు.
ఈ విషయంపై ఎమ్మెల్సీ వీణా స్పందిస్తూ - `నా రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటన మొదటిసారి చూస్తున్నాను. వేదిక మీద `నువ్వు చాలా బరువు తగ్గావ్!` అంటూ ఆయన నా చేయి పట్టుకోవడంతో నేను షాకయ్యాను. వెంటనే నా చేయి వెనక్కి లాక్కున్నాను. తర్వాత కార్యక్రమం అయ్యే వరకు ఆయన నాతో మాట్లాడలేదు. ఇంటికి వెళ్లి ఫోన్ చేసి క్షమించాలని, తనకు నేను చెల్లితో సమానమని చెప్పారు. ఈ విషయం గురించి త్వరలో అధిష్ఠానంతో మాట్లాడుతాను` అన్నారు.
ఇదే విషయంపై టీపీ రమేశ్ స్పందిస్తూ - `వీణా నాకు చాలా కాలంగా తెలుసు. ఆమె నాకు చెల్లి వంటిది. ఆమెతో నేను అసభ్యంగా ప్రవర్తించలేదు. ఒకవేళ ఆమె కోరుకుంటే అందరిముందు క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధమే` అన్నారు.