: రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తి నుంచి.. బ్యాగు, మొబైల్ ఫోన్, జేబులోని సొమ్ము చోరీ చేసిన పాదచారులు!
మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోందనడానికి సాక్ష్యంగా మరో ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. రక్తపు మడుగులో పడిఉన్న అతనిని ఇతర వాహనదారులు చూస్తూ వెళ్లిపోయారే తప్ప అంబులెన్స్‌కి కూడా ఫోన్ చేయలేదు. అంతేకాదు, అటుగా వెళుతున్న పాదచారులు బాధితుడి వద్ద ఉన్న బ్యాగు, మొబైల్ ఫోన్, జేబులో ఉన్న రూ.12లను తీసుకున్నారు. రక్తపు మడుగులో అతడు 12 గంటలు అలాగే రోడ్డుపక్కన పడి ఉన్నాడు.
చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకుని వారు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు బాధితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నరేంద్రకుమార్(35) అని పోలీసులు చెప్పారు. అతడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.