: ఇక గోడదూకి 'జంప్ జిలానీ'నవుతా... ఆపై ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత!: ముద్రగడ ఫైనల్ వార్నింగ్
ప్రతి రోజూ ఇంటి నుంచి బయలుదేరి పాదయాత్రకు సిద్ధం కావడం, ఆపై పోలీసులు అడ్డుకోవడంతో వెనక్కు వెళ్లిపోతున్న కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం నేడు ఏపీ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తనను పాదయాత్రకు వెళ్లనీయకుండా పోలీసులు ఇంటి ముందే కాపుకాయడం తన హక్కులను కాలరాయడమేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఏదో ఒక రోజు ఎవరికీ చెప్పకుండా రాత్రిపూట గోడ దూకి నడక మొదలు పెడతానని, ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబుదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు.
తాను కూడా 'జంప్ జిలానీ'గా మారతానని చెబుతూ, తనను శాంతియుతంగా పాదయాత్ర చేసుకోనివ్వాలని చేతులెత్తి మొక్కుతూ పోలీసులను ముద్రగడ కోరారు. అంతకుముందు ముద్రగడ బయటకు రాగా, పోలీసులు అడ్డుకున్నారు. ఆపై ఇంటి ముందే ఒకరోజు నిరసనకు కూర్చుంటున్నట్టు ప్రకటించిన ఆయన, తనను కలిసేందుకు వచ్చిన కాపు నేతలతో కాసేపు మాట్లాడారు.