: పోలీసులకు థ్యాంక్స్... రాకుంటే ఏమయ్యేదోనన్న మహిళా విలేకరి!
ముంబైలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే నిమిత్తం ఆటోలో ఎక్కిన ఓ మహిళా విలేకరిని ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వెంబడిస్తూ, వేధింపులకు దిగిన వేళ, ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే స్పందించిన తీరుపై ఇప్పుడు ప్రశంసలు వస్తున్నాయి. వారు రాకుంటే తన పరిస్థితి ఎలా ఉండేదోనని తలచుకుంటే భయంగా ఉందని బాధితురాలు వెల్లడించారు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, అంధేరీ నుంచి తన నివాసమున్న జుహూ ప్రాంతానికి మహిళా విలేకరి బయలుదేరగా, చిత్రకూట్ సమీపానికి ఆటో వచ్చేసరికి ఇద్దరు యువకులు 5994 నంబర్ గల టూ వీలర్ పై వెంబడించడం మొదలు పెట్టారు. పదే పదే ఆమెను చూస్తూ కామెంట్లు చేశారు. ఆటోను ఛేజ్ చేస్తుంటే భయపడిన ఆమె, వారి ఫోటో తీయడంతో పాటు, సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఆమె సెల్ ఫోన్ ఆధారంగా ప్రయాణిస్తున్న దారిని ట్రాక్ లో ఉంచి, నిమిషాల్లో స్పందించారు. ఈలోగా ఇద్దరు యువకులు మాయం కాగా, పోలీసులు వేగంగా స్పందించిన తీరు తనను కాపాడిందని, ఈ యువకులు ఎవరికైనా తెలిస్తే, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.