: లైంగిక వేధింపులకు పరాకాష్ట... మహిళా ఉద్యోగి చీర లాగిన సీనియర్... వీడియో చూడండి!
తన కింద పనిచేస్తున్నఓ యువతి చీరను సీనియర్ ఉద్యోగి లాగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో లైంగిక వేధింపులకు పరాకాష్టగా మారిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే... ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బాధితురాలు (33) విధులు నిర్వహిస్తోంది. జూలై 29న ఆమె పుట్టిన రోజు. హోటల్ లో సెక్యూరిటీ మేనేజర్ గా పని చేస్తున్న సీనియర్ ఎంప్లాయి పుట్టిన రోజు నాడు ఆమెను లైంగికంగా వేధించాడు.
"ఆ రోజు నా పుట్టిన రోజు. ఆయన తన క్యాబిన్ కు నన్ను పిలిచాడు. క్రెడిట్ కార్డు తీసి చూపుతూ ఏం బహుమతి కావాలో కోరుకోమని అడిగాడు. తన పక్కన కూర్చోమని చెప్పాడు. నేను కూర్చోకుంటే, చీర కొంగు పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. పక్కన ఉన్న ఇతర ఉద్యోగులను బయటకు వెళ్లాలని ఆదేశించాడు. రాత్రికి తనతో గడపాలని అడిగాడు" అని ఆమె తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకొచ్చింది.
జరిగిన ఘటనను ఆమె అదే రోజు మానవ హక్కుల విభాగం దృష్టికి తీసుకెళ్లగా వారు ఎలాంటి చర్యా తీసుకోలేదు. చివరకు భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇక నిన్న ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్టు హోటల్ యాజమాన్యం ప్రకటించింది. సీసీటీవీ ఫుటేజ్ ని ఆమెకు అందించిన మరో సహోద్యోగిని కూడా తొలగించగా, ఈ విషయంలో దుమారం చెలరేగుతోంది.