: రూ. 5 వేల డబ్బులు, దేవుడి పటం తీసుకుని ఓ దెయ్యం వస్తుంది... అప్పుడిలా చేయండి!: జగన్ చెప్పిన చిట్కా
నంద్యాలలో ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న జగన్, ఈ రోజు కూడా రోడ్ షోలో పాల్గొని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఓటుకు రూ. 5 వేల వరకూ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటుతో పాటే దేవుడి ఫోటో తీసి ప్రమాణం చేయించుకుంటున్నారని చెప్పిన జగన్, ఆ సమయంలో ఏం చేయాలో ప్రజలకు సూచించారు.
"వస్తాడు చంద్రబాబు తన అవినీతి సొమ్ముతో మీ అందరి దగ్గరికీ. ప్రతి ఒక్కరి చేతుల్లో ఐదు వేలు పెడతారు. జేబులో నుంచి దేవుడి పటం తీస్తారు. మీ అందరితోనూ ప్రమాణం చేయించుకునే కార్యక్రమం చేస్తాడు. మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెబుతున్నా. ఏ దేవుడు కూడా పాపానికి ఓటు వేయమని చెప్పడని మీ అందరికీ చెబుతున్నా. కేవలం దెయ్యాలు మాత్రమే అలా చెబుతాయని గుర్తు చేస్తున్నా. దెయ్యాలు మీ దగ్గరికి వస్తాయి. చేతిలో 5 వేలు పెడతాయి. దెయ్యాలు జేబులోంచి దేవుడి ఫోటో తీస్తాయి. మీతో ప్రమాణం చేయించుకుంటాయి.
అలా జరిగినప్పుడు మీరంతా ఏం చేయాలో చిన్న చిట్కా చెబుతాను. అలా దెయ్యాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి కళ్లు మూసుకోండి. దేవుడిని ఒక్క సెకన్ మనసులో తలచుకోండి. ధర్మం వైపున నేనుంటాను దేవుడా అనుకోండి. వచ్చిన దెయ్యాలతో లౌక్యంగా వ్యవహరించండి. గొడవ పడొద్దు. దేవుడు కూడా అదే చెబుతున్నాడు. లౌక్యంగా తప్పించుకోండి. ఓటు వేసేటప్పుడు మాత్రం న్యాయానికి, ధర్మానికి ఓటు వేయండి" అని చెప్పారు. ప్రజలు వేస్తున్న ఓటు చంద్రబాబు మోసానికి, అబద్ధాలకు చెక్ చెప్పాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలో మార్పును తీసుకురావడం ప్రజల వల్లే సాధ్యమవుతుందని చెప్పారు.