: రాబందులు కావాలి.. వంద కోట్లు అయినా ఇస్తామంటున్న పార్శీలు!


సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి మతాచారాలను బట్టి మృతదేహాన్ని దహనం చేయడమో లేక ఖననం చేయడమో చేస్తుంటారు. పార్శీలు మాత్రం విభిన్నం. వీరు తమలో ఎవరైనా మృత్యువాతపడితే వారి మృతదేహాన్ని ఎత్తైన ప్రదేశాలకు తీసుకెళ్లి వదిలిపెడతారు. అక్కడికి రాబందులు వచ్చి ఆ మృతదేహాన్ని ఆరగిస్తాయి. అలా మరణించాక కూడా మరో జీవికి తాము ఉపయోగపడాలన్నది పార్సీల అభిమతం. అయితే ఇప్పుడు రాబందులు ఎక్కడా కనబడడం లేదు. ఎన్ని చర్యలు తీసుకున్నా వాటి సంతానోత్పత్తి పెరగడం లేదు.

ఆడరాబందు ఏటా ఒక గుడ్డు పెడుతుంది. ఇది పెట్టే గుడ్డు పొదిగి పిల్లగా మారి, అది బతికి బట్టకడితే విజయం సాధించినట్టే. అయితే ఆహారంలో రసాయనాల వాడకం పెరిగిపోవడంతో అవి తినే ఆహారం కలుషితమైపోతోంది. అంతే కాకుండా గతంలో రాబందులు ఊరిబయట విచ్చలవిడిగా తిరుగుతుండడంతో భయాందోళనలకు గురైన ప్రజలు డైక్లోఫినాక్ వాడకం ద్వారా వాటిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాబందులు అదృశ్యమవుతున్నాయి.

అలా ఇప్పుడవి అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో డైక్లోఫినాక్ ను కేంద్రం నిషేధించింది. 2011లో కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం పాలరాపుగుట్టలో రాబందులు కనిపించాయి. అప్పుడు పది రాబందులు ఉన్నాయని గుర్తించారు. వాటికి సక్రమంగా ఆహారం అందించడంతో ఇప్పుడు వాటి సంఖ్య 30కి చేరింది. వీటితో పాటు రెండు ఈజిప్షియన్‌ జాతికి చెందిన రాబందులు కూడా కనువిందు చేయడం ఆసక్తి రేపుతోంది. రాబందులు నెలలో రెండు లేదా మూడుసార్లే ఆహారం తీసుకుంటాయి. నాలుగైదు వందల కిలోల మాంసాన్నయినా ఒకట్రెండు గంటల్లోనే ఆరగించడం వీటి ప్రత్యేకత.

కాగా, పాలరాపుగుట్టలో ఇప్పటివరకు 30 సార్లు పశువులను వాటికి ఆహారంగా అందించినా కేవలం తొమ్మిదిసార్లే ఆరగించాయని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. అయితే రాబందులను పెంచాలని, వాటిని తాము కోరుకున్న చోటికి రప్పిస్తే వంద కోట్ల రూపాయలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పార్శీలు చెబుతున్నారని అటవీశాఖ అధికారులు అంటున్నారు. మరోపక్క తాము పరిశోధనలు చేస్తున్నామని, తమ సంరక్షణలో ఉన్న 30 రాబందుల సంఖ్య కనీసం వంద అయితే అప్పుడు తమ శ్రమ ఫలించినట్టేనని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News