: కజిరంగా జాతీయ పార్కులో వరద బీభత్సానికి 140 వన్యమృగాల బలి
గత కొన్ని రోజులుగా అస్సాంలో వరదల వల్ల జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. ఈ వరదల వల్ల వన్యమృగాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడి కజిరంగా జాతీయ పార్కు జలమయమైంది. పార్కులో 481 కి.మీ.ల మేర నీరు చేరడం వల్ల దాదాపు 140 వరకు వన్యమృగాలు మృత్యువాతపడ్డాయి. వీటిలో ఏడు ఖడ్గమృగాలు, 122 మచ్చల జింకలు, రెండు ఏనుగులు, మూడు అడవిపందులు, రెండు లేళ్లు, మూడు సాంబార్ జింకలు, ఒక అడవిదున్నతో పాటు ఒక ముళ్లపంది కూడా చనిపోయినట్లు కజిరంగా జాతీయ పార్కు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిణి భల్లావ్ సైకియా ధ్రువీకరించారు. వీటిలో చాలా జంతువులు నీళ్లలో మునిగి మరణించినట్లు ఆయన తెలిపారు. బ్రహ్మపుత్ర నది ఉప్పొంగడం వల్ల పార్కులోకి ఎక్కువగా నీరు చేరిందని, జంతువులు దిక్కుతోచని స్థితిలో వరదలో కొట్టుకుపోయి మరణించాయని ఆయన చెప్పారు.