: వారానికి 2 లక్షలు ఆదాయం.. విమాన ప్రయాణం.. హైటెక్ వ్యభిచారం రూటే సపరేటు!
కోల్ కతాలో మకాం వేసి హైదరాబాదులో వ్యభిచారం నిర్వహిస్తున్న హైటెక్ అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఐదురోజుల క్రితం మాదాపూర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. భార్యాభర్తలు రాజేశ్ పర్వాల్, ఆర్తీ పర్వాల్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు తమ నాయకుడు సంజయ్ అని చెప్పారు. వారిచ్చిన సమాచారంతో బెంగళూరుతో పాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాడులు చేయగా, ఏడుగురు వ్యభిచార గృహ నిర్వాహకులు పట్టుబడ్డారు. వారందరినీ విచారించి షాకింగ్ విషయాలను పోలీసులు తెలుసుకున్నారు.
పోలీసులు తెలుసుకున్న వివరాల్లోకి వెళ్తే... హైటెక్ వ్యభిచారం నిర్వహించేందుకు సంజయ్ సుమారు యాభై వెబ్ సైట్లు రూపొందించి నడిపిస్తున్నాడు. వీటి నిర్వహణ కోసం భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించాడు. వీరి పని కొత్త కొత్త యువతుల ఫోటోలను అప్ లోడ్ చేయడమే. ఈ దందాలో ఈవెంట్ మోడల్స్, డ్యాన్సర్లు సహా సినీ రంగంలో అంతగా అవకాశాలు రానివారు ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది ముంబై, కోల్ కాతా, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ నగరాలకు చెందిన యువతులు ఉండడం విశేషం. వారిని ఎలా ఆకట్టుకుంటాడంటే...అందమైన యువతులను గుర్తించి వారి అవసరాలను తెలుసుకుంటాడు. తరువాత వారికి భారీగా డబ్బు ముట్టజెబుతాడు.
వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఖరీదైన పార్టీల్లో పాల్గొనేందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పంపిస్తాడు. అలా మచ్చిక చేసుకున్న తరువాత వారికి పనులు అప్పజెబుతాడు. పార్టీల సందర్భంగా తీసిన ఫోటోలను తన వెబ్ సైట్లలో అప్ లోడ్ చేస్తాడు. ఈ వెబ్ సైట్లలో అమ్మాయిని బుక్ చేసుకోవాలంటే 25,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లించాల్సిందే. డిమాండ్ ను బట్టి నిర్ణయమవుతుంది. కస్టమర్ కోరుకున్న అమ్మాయిని విమానంలో ఆ నగరానికి పంపిస్తాడు. ఆ నగరంలో తను నడిపిస్తున్న వ్యభిచార కేంద్రంలో ఆమెతో గడపమంటాడు. ఇలా విటులతో గడిపినందుకు ఒక్కో యువతికి వారానికి ఇంచుమించు రెండు లక్షల రూపాయలు చెల్లిస్తుంటాడు. కోల్ కతాలో ఉండే సంజయ్ కోసం వేట మొదలైంది. పట్టుబడితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.