: షార్జాలో కేరళ వాసి దుర్మరణం .. కారులో నుంచి కిందపడి బ్యూటీషియన్ మృతి!
వెళుతున్న కారులో నుంచి కిందపడి భారత్ కు చెందిన మాజీ రాజకీయ నాయకురాలు ఒకరు దుర్మరణం చెందిన సంఘటన షార్జాలో జరిగింది. షార్జాలోని ధైడ్ రోడ్ లో జరిగిన ప్రమాదంలో కేరళకు చెందిన సునీతా ప్రశాంత్ (40) మృతి చెందినట్టు ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. కిందపడిన వెంటనే ఆమె వెళ్లి లైట్ స్తంభానికి బలంగా ఢీకొట్టుకోవడంతో, తలకు తీవ్రగాయాలై మృతి చెందినట్టు తెలిపింది.
కేరళలోని కాసర్ గాడ్ జిల్లాలోని అడుక్కత్ వాయల్ బీచ్ ప్రాంతానికి చెందిన సునీత, వృత్తిరీత్యా షార్జాలోని ఓ సెలూన్ లో బ్యూటీషియన్ గా గత ఐదేళ్లుగా పనిచేస్తోంది. సునీత తన కొలీగ్స్ తో కలిసి సెలూన్ ఉన్న బిల్డింగ్ లోనే ఓ అపార్టుమెంట్ లో ఉంటోంది. వారు నివసించే అపార్టుమెంట్ లో పెస్టిసైడ్ స్ప్రే చేయడంతో మూడు గంటల పాటు అక్కడికి రావద్దని చెప్పారు. దీంతో, సునీత సహా తమ సిబ్బందిని సెలూన్ యజమాని తన కారులో బయటకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ధైడ్ రోడ్ లో ప్రయాణిస్తున్న సమయంలో కారు డోర్ తెరచుకోవడంతో అందులో నుంచి రోడ్డుపై పడ్డ సునీత అక్కడికక్కడే మృతి చెందింది.
సునీతకు భర్త ప్రశాంత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఈ సందర్భంగా షార్జాలోని ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ అధ్యక్షుడు గణేశ్ అరమంగనమ్ మాట్లాడుతూ, గతంలో బీజేపీ తరపున కాసర్ గాడ్ మునిసిపాలిటీ కౌన్సిలర్ గా ఆమె పని చేశారని, 2011 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఉడుమా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారని చెప్పారు.