: బుర్ఖా ధరించి సెనేట్‌కు హాజరైన ఆస్ట్రేలియన్ పార్టీ నాయకురాలు... దుమ్మెత్తిపోసిన ఇతర నేతలు!
భద్రతా కారణాల దృష్ట్యా ఆస్ట్రేలియన్ ముస్లింలు బుర్ఖా ధరించడంపై నిషేధం విధించాలని కోరుతూ వన్ నేషన్ పార్టీ సెనేటర్ పౌలీ హాన్సన్, బుర్ఖా ధరించి సెనేట్ సమావేశానికి హాజరైంది. ఈ చర్యతో ఆస్ట్రేలియా సెనేట్‌లోని అధికార, ప్రతిపక్షాలు ఆమెపై దుమ్మెత్తి పోశాయి. అధికార పార్టీ తరఫున అటార్నీ జనరల్ జార్జ్ బ్రాండీస్ ఆమెను గట్టిగా మందలించారు. అలాగే బుర్ఖాను నిషేధించడం కుదరదని తేల్చిచెప్పారు.
`సెనేటర్ హాన్సన్.. ఆస్ట్రేలియాలో బుర్ఖాను నిషేధించడం కుదరదు. మీరు ముస్లిం కాకపోయినా, బుర్ఖా ధరించి ఇవాళ మీరు చేసిన నాటకం వల్ల ఎంతమంది ఆస్ట్రేలియన్ ముస్లింల మనసులను గాయపరిచి ఉంటారో ఊహించండి. మన దేశంలో 5 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో మంచి వారు కూడా ఉన్నారు. ఇవాళ మీ చేష్టలతో వారి మనోభావాలను దెబ్బతీశారు. దీనికి మీరు తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది` అని జార్జ్ అన్నారు. ఆయన మాటలకు ప్రతిపక్షం కూడా మద్దతు తెలిపింది. హాన్సన్‌కు చెందిన వన్ నేషన్ పార్టీ మొదట్నుంచి ముస్లింలకు వ్యతిరేకమే. ముస్లింల కారణంగానే ఆస్ట్రేలియాలో తీవ్రవాదం పెరుగుతోందని వారి నమ్మకం. అందుకే భద్రతా కారణాల కోసం బుర్ఖాను నిషేధించాలని వన్ నేషన్ పార్టీ పట్టుబడుతోంది.