: జయ మృతిపై జ్యుడీషియల్ విచారణకు పళనిస్వామి ఆదేశం.. పన్నీర్ కండిషన్లలో ఒకటి నెరవేరింది!
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జ్యుడీషియల్ విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు అవుతుందని పళని తెలిపారు. పోయస్ గార్డెన్ లోని జయ నివాసం వేద నిలయాన్ని స్మారక కేంద్రంగా మారుస్తామని చెప్పారు. పళనిస్వామి ఆదేశాల పట్ల పన్నీర్ సెల్వం వర్గీయులు ఆనందం వ్యక్తం చేశారు.
శశికళ, దినకరన్ లకు చెక్ పెట్టే క్రమంలో పళని, పన్నీర్ వర్గాలు ఏకం కానున్నాయి. అయితే విలీనం కావడానికి పన్నీర్ సెల్వం రెండు కండిషన్లు పెట్టారు. అందులో ఒకటి జయ మృతిపై విచారణ జరిపించడం కాగా... రెండోది పార్టీకి దూరంగా శశికళ, దినకరన్ లను తరిమికొట్టడం. ఈ క్రమంలో పన్నీర్ షరతులలో ఒకటి నెరవేరినట్టైంది. ఢిల్లీలో ప్రధాని మోదీని పన్నీర్ సెల్వం కలిసిన తర్వాత అన్నాడీఎంకేలోని పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇరు వర్గాలు ఒక్కతాటిపైకి వచ్చేందుకు ముందడుగు వేశాయి.