: చంద్రబాబు నిజ స్వరూపాన్ని పవన్ అర్థం చేసుకున్నారు.. బాలయ్య కూడా అర్థం చేసుకోవాలి: అంబటి
నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు టీడీపీ తరఫున ప్రచారం చేస్తోన్న ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణపై చురకలు అంటించారు. ఆయన చేస్తోన్న ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎటువంటి వ్యక్తో బాలకృష్ణ తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ తరఫున బాలకృష్ణతో ప్రచారం చేయించుకుంటున్న చంద్రబాబు మంత్రి పదవిని మాత్రం తన కుమారుడు లోకేశ్‌కి ఇచ్చారని ఆయన విమర్శించారు.
నంద్యాల ఎన్నికల్లో తమ పార్టీ తటస్థంగా ఉంటుందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ చెప్పడం శుభ పరిణామమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి దుష్ట పాలనను పవన్ కల్యాణ్ అర్థం చేసుకున్నారని అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు ఎటువంటి వ్యక్తన్న విషయాన్ని పవన్ కల్యాణ్ అర్థం చేసుకున్నందుకు సంతోషమని వ్యాఖ్యానించారు.