: నిరాడంబరంగా జరిగిన ఇరోమ్ షర్మిల వివాహం
మానవహక్కుల సామాజిక వేత్త ఇరోమ్ చాను షర్మిల, బ్రిటన్‌కు చెందిన డెస్మంట్ కౌటిన్హోల వివాహం తమిళనాడులోని కొడైకెనాల్‌లో నిరాడంబరంగా జరిగింది. `ప్రత్యేక వివాహ చట్టం 1954` కింద వివాహానికి అనుమతి రావడం కోసం వారు రెండు నెలలు ఎదురుచూశారు. చివరికి కొడైకెనాల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వారి వివాహానికి ఆమోదం తెలపడంతో వారిరువురు ఒక్కటయ్యారు.
పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, వారి పెళ్లిని చిత్రీకరించే వ్యక్తి మినహా ఎవరూ ఈ పెళ్లికి హాజరు కాలేదు. `మా అమ్మకు ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఫోన్ ద్వారా ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఇక మిగతా బంధువులకు మేం ఎలాంటి ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు. కాబట్టి ఎవరూ రాలేదు` అని షర్మిల చెప్పారు. గురువారం ఉదయం 10:30కి తమ వివాహ ధ్రువీకరణ పత్రం అందజేయనున్నారని, త్వరలో కొడైకెనాల్‌లోని చర్చిలో బంధువులను పిలిచి వేడుక జరుపుతామని ఆమె తెలిపారు.