: పవన్ కల్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారు.. బాలయ్య ప్రవర్తన దారుణం: గడికోట శ్రీకాంత్ రెడ్డి
నంద్యాల ఉప ఎన్నికలో తటస్థంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న దోపిడీ పవన్ కు తెలిసి ఉంటుందని... ఆయన అభిమానులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు. వైసీపీ అధినేత జగన్ కు వస్తున్న ప్రజాదరణను టీడీపీ నేతలు ఓర్చలేకపోతున్నారని విమర్శించారు. జగన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని... ఇది చూసి టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. కృత్రిమ నేత నారా లోకేష్ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజ్ఞత కోల్పోతున్నారని... సొంత పార్టీ కార్యకర్తపై ఆయన చేయి చేసుకోవడం దారుణమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా బాలయ్య డబ్బు పంచడం దుర్మార్గమని తెలిపారు. భూమా కుటుంబాన్ని జగన్ అక్కున చేర్చుకుంటే, చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. అఖిలప్రియకు తెలియకుండానే గంగుల ప్రతాప్ రెడ్డిని టీడీపీలో చేర్చుకుంటున్నారని... వాస్తవాలను ఇప్పటికైనా అఖిలప్రియ తెలుసుకోవాలని సూచించారు.