: పోయిందనుకున్న డైమండ్ ఉంగరం.... 13 ఏళ్లకు క్యారెట్ దుంపకు కాసింది!
డబ్బులు చెట్లకు కాయకపోవచ్చు... కానీ డైమండ్ ఉంగరాలు కాస్తాయని చెప్పే సంఘటన కెనడాలో జరిగింది. తన గార్డెన్‌లో పెరుగుతున్న క్యారెట్ చెట్టుకు కాసిన డైమండ్ ఉంగరాన్ని చూసి మేరీ గ్రామ్స్ ఆశ్చర్యపోయింది. కాకపోతే అది 13 ఏళ్ల క్రితం తాను పోగొట్టుకున్న ఎంగేజ్‌మెంట్ ఉంగరం అని గ్రహించి ఆనంద భాష్పాలు రాల్చింది.
`నా ఉంగరం పోయినపుడు నేను వెతకని చోటు లేదు. 10 రోజుల పాటు ఉంగరం కోసం అన్ని చోట్లా వెతికాను. ఇక దొరకకపోవడంతో కొత్త ఉంగరం కొనుక్కున్నాను. ఇటీవల నా కోడలు క్యారెట్ చెట్లు కోస్తుండగా ఒక క్యారెట్ దుంపకు ఉంగరం ఉండటం చూసింది. తాను నాకు చూపించగానే అది 13 ఏళ్ల క్రితం నేను పోగొట్టుకున్న ఉంగరమని గుర్తించాను` అంటూ మేరీ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని మేరీ తెలిపింది. గతంలో జర్మనీ, స్వీడన్‌లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.