: ఐర్లాండ్ ప్రధానిని గుర్తించలేదు సరికదా.. 20 నిమిషాలు వెయిట్ చేయించి, చిన్న టేబుల్ కేటాయించిన మహిళ!


సాక్షాత్తు ప్రధాన మంత్రి మనం నిర్వహించే హోటల్ కు టిఫిన్ చేసేందుకు వస్తే మన పరిస్థితి ఏంటి? ఎలా ఫీలవుతాం? ఆశ్చర్యంతో ఎగిరి గంతేసి, హోటల్ లో ఉన్నవారందర్నీ వదిలేసి, ఆయన ఏమడిగితే అది తెచ్చిచ్చే ప్రయత్నంలో ఉంటాం కదా?...కానీ ఐర్లాండ్ ప్రధాని, భారత సంతతి వ్యక్తి లియో వరాద్కర్ కి చిత్రమైన అనుభవం ఎదురైంది.

 దాని వివరాల్లోకి వెళ్తే...ఐర్లాండ్ లోని డబ్లిన్‌ నగరానికి చెందిన ఎమ్మా కెల్లీ (20) షికాగోలోని ఓ ఫలహార శాలలో సేవకురాలిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆ ఫలహార శాలకు తన స్నేహితుడితో కలిసి లియో వరాద్కర్‌ వెళ్లారు. వారిని చూడగానే 'మీరు ఐర్లాండ్ వాసులా?' అని కెల్లీ ప్రశ్నించింది. 'అవును' అని వారు సమాధానం చెప్పడంతో కాసేపు ఎదురు చూడమని చెప్పింది.

 తరవాత 20 నిమిషాలకు మూలనున్న చిన్న టేబుల్ వారిద్దరికీ చూపించింది. ఇంతలో ఆమె మిత్రుడు ఆయనను గుర్తుపట్టి ఆశ్చర్యపోవడంతో చేసిన తప్పును గుర్తించిన కెల్లీ...ఆయన వద్దకు వెళ్లి క్షమాపణలు కోరింది. దీనిపై ఆమె ఆర్టీఈ రేడియోలో మాట్లాడుతూ, ప్రధాని తన ఫలహార శాలకు వస్తారని అస్సలు ఊహించలేదని తెలిపింది. వెంటనే వారిని వేరే టేబుల్ కు మార్చానని, క్షమించమని కోరితే...అలా అనవద్దని, 'తనను సాధారణ పౌరుడిలా చూడడం నచ్చింద'ని తెలిపారని తెలిపింది.

ఈ ఘటన మొత్తాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో రాసింది. దానిని చూసిన వరాద్కర్... ‘ధన్యవాదాలు ఎమ్మా.. మీ ఆహారం, సేవలు చాలా బాగున్నాయి’ అని అభినందించారు. ముంబైకి చెందిన అశోక్ వరాద్కర్ ఐర్లాండ్ వెళ్లి డాక్టర్ గా సేవలందించారు. అక్కడే లియో వరాద్కర్ జన్మించారు. ఐర్లాండ్ తొలి స్వలింగ సంపర్క ప్రధాని లియో వరాద్కర్ కావడం విశేషం. 

  • Loading...

More Telugu News