: 900 కేజీల టమోటాలు దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
గత కొన్ని నెలలుగా టమోట ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. వాటిని కూడా దొంగతనం చేస్తున్నారంటే టమోటల ధర ఏ స్థాయికి పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత నెల ముంబైలోని దహిసార్ మార్కెట్‌లో రూ. 57,000 విలువైన 900 కేజీల టమోటాలను దొంగతనం చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు పట్టుకున్నారు. దోచుకున్న టమోటాలను కుర్లా ప్రాంతంలోని టమోటా మార్కెట్‌లో అమ్మినట్లు ఆ వ్యక్తి అంగీకరించాడు.
జూలై 18న దహిసార్ మార్కెట్ వద్ద టమోటాలు అమ్మే జగత్ శ్రీవాత్సవ్ తాను నవీ ముంబై మార్కెట్ నుంచి కొన్న 900 కేజీల టమోటాలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మార్కెట్‌లోని సీసీ ఫుటేజీల ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇక చేసేది లేక నెల రోజుల పాటు మార్కెట్లో మఫ్టీలో ఉండి నిందితుడిని చంద్రశేఖర్ రాధేశ్యామ్ గుప్తాగా గుర్తించి పట్టుకున్నారు. కానీ నిందితుడు దోచుకున్న టమోటాలను అమ్మేయడంతో వాటిని రికవర్ చేయలేకపోయారు.