: కోడలికి నరకయాతన చూపిస్తున్నాడని కొడుకును హతమార్చిన తల్లి!
మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, ప్రతిరోజు కోడలికి నరకయాతన చూపిస్తున్న కొడుకును కన్నతల్లి హతమార్చిన సంఘటన ముంబైలో జరిగింది. మన్‌ఖుర్ద్ ప్రాంతానికి చెందిన నదీమ్‌కు మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటుంది. పెళ్లి చేస్తే బాగుపడతాడనుకుని అతని తల్లి అన్వారీ రెండేళ్ల క్రితం అలహాబాద్‌కి చెందిన యువతితో వివాహం చేసింది. అయినా నదీమ్‌లో ఎలాంటి మార్పూ రాకపోక, ఏదో ఒక వంకతో ప్రతిరోజు భార్యను చావగొట్టేవాడు. అతను బాధలు తట్టుకోలేక ఐదు నెలలకే ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత అత్త వచ్చి నచ్చజెప్పడంతో తిరిగి కాపురానికి వచ్చింది.
మరుసటిరోజు నదీమ్ మళ్లీ డ్రగ్స్ తీసుకుని ఇంటికి రావడం గమనించిన అన్వారీ, మళ్లీ ఏదో ఒక గొడవ చేస్తాడని గ్రహించి కోడల్ని తన స్నేహితురాలింటికి పంపింది. ఈ విషయం తెలిసిన నదీమ్ తన తల్లిని దారుణంగా కొట్టాడు. ఇక తన కొడుకు మారడు అనుకున్న అన్వారీ చున్నీతో నదీమ్‌ని ఉరేసి చంపేసింది. తర్వాత రాత్రంతా కుమారుడి మృతదేహం పక్కనే రోదిస్తూ కూర్చుంది. ఉదయం నదీమ్ భార్య ఇంటికి తిరిగి రాగానే తన అత్త ఏడుస్తూ ఉండడం చూసి నిర్ఘాంతపోయింది. కుటుంబాన్ని రక్షించుకోవడానికి నదీమ్‌ని చంపేశానని అన్వారీ చెప్పడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. అన్వారీపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.