: చంపేస్తానని బెదిరించిన 'జయ జానకి నాయక' సినిమా నిర్మాణ సంస్థ మేనేజర్ పై కేసు!
బాకీ తీర్చమన్న వ్యక్తిని చంపేస్తానని బెదిరించిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 'ద్వారకా క్రియేషన్స్' మేనేజర్ కిషోర్ పై హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన 'జయ జానకి నాయకా' సినిమాలో ఒక పాటను గత డిసెంబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు చిత్రీకరించారు. ఆ పాటలో ఉపయోగించిన లైటింగ్ కాంట్రాక్ట్ ను కృష్ణానగర్ కు చెందిన పెద్దిరెడ్డి అశోక్ రెడ్డి అనే వ్యక్తికి అప్పగించారు.
ఈ పాట చిత్రీకరణ పూర్తైన తరువాత లైటింగ్ బిల్లు 10.75 లక్షలైందని చెప్పిన అశోక్ రెడ్డి...నిర్మాత రవీందర్ ను డబ్బులడిగాడు. దీంతో ఆయన తరువాత ఇస్తానని చెప్పాడు. దీంతో బకాయి డబ్బులు చెల్లించాలని రెండు రోజుల క్రితం అశోక్ రెడ్డి ద్వారక క్రియేషన్స్ మేనేజర్ కిషోర్ ను సంప్రదించాడు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో డబ్బులు ఇచ్చేది లేదని, మళ్లీ అడిగితే చంపేస్తానని కిశోర్ బెదిరించాడని అశోక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.